మిత్రమా… జర భద్రం!

ఇలా చెప్పుకుంటూ పోతే పదినిమిషాలకు మూడు ప్రాణాల చొప్పున ఒక్క మన దేశంలోనే రోజుకు 400 మంది గురించి చెప్పుకోవాలి. పత్రికల్లో నేరవార్తల పేజీల్లో ఒకటీ రెండు పేరాగ్రాఫుల వార్తలాగా నిత్యం కన్పించే ఘటనలే ఇవన్నీ. చదివి, అయ్యో అనుకుని పేజీ తిప్పేస్తాం. పేజీతో పాటే మనసూ మళ్లుతుంది. కానీ, కాలు విరిగో చేయి తెగిపోయో నెలల తరబడి ఆస్పత్రిపాలైన వాళ్లూ, వైద్యం కోసం అప్పులపాలైనవాళ్లూ, వెన్నెముక నలిగిపోయి చక్రాల కుర్చీకి పరిమితమైనవాళ్లూ, చేతికందివచ్చిన చెట్టంత కొడుకునో కూతురినో కోల్పోయి జీవచ్ఛవాల్లా మిగిలిన అమ్మానాన్నలూ, సంపాదించి పెట్టే ఒక్క ఆధారాన్నీ కోల్పోయి దిక్కూ మొక్కూ లేకుండా మిగిలిన తల్లీబిడ్డలూ- అలా పేజీ తిప్పేయగలరా? రోజులూ నెలలూ కాదు, ఏళ్ల తరబడి ఆ గాయం వారిని బాధిస్తూనే ఉంటుంది. ఆ ఒక్క క్షణం… అలా జరక్కుండా ఉండి ఉంటే ఎంత బాగుండేదో కదా అనుకుంటూ వాళ్లు అనుభవించే వేదనని గుర్తు చేయడానికే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ నవంబరు మూడో ఆదివారాన్ని సంస్మరణ దినంగా నిర్వహిస్తున్నాయి. రోడ్డుప్రమాదాల నివారణపై దృష్టిపెడుతున్నాయి.

తప్పెవరిది?

wife died infront of her husband

wife died infront of her husband

అసలు రోడ్డు ప్రమాదాలకు కారణమెవరు? నూటికి తొంభై సంఘటనల్లో- సమాజమే… సమాజంలోని మనమే! మిగిలిన పది శాతం ప్రమాదాలకు మాత్రమే రోడ్డూ లేదా వాహనాలూ కారణాలు. నిజానికి ప్రమాదం జరగాలని ఎవరూ కోరుకోరు. కానీ ప్రమాదం జరగడానికి ఏమాత్రం ఆస్కారం లేనంత జాగ్రత్తగా ఉంటున్నామా అంటే… లేదనే చెప్పాలి. రోడ్డు మీద ప్రయాణికులుగా భారతీయులు ప్రవర్తించే తీరు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. దానికి తోడు లైసెన్సులిచ్చే చోట అవినీతి, రోడ్ల నిర్మాణంలో లోపాలు, ట్రాఫిక్‌ నియంత్రణా నియమాల గురించి సరైన చట్టాలు లేకపోవడం, ఉన్నా అమలుచేయకపోవడం, వాహనాల నాణ్యతలో రాజీపడడం, మద్యం తాగి వాహనాలు నడపడం, ప్రమాదాలు జరిగినప్పుడు విచారణలో లోపాలు, కోర్టు చుట్టూ ఎవరు తిరుగుతారని ఎంతో కొంత నష్టపరిహారంతో సర్దుకుపోవడం… కర్ణుడి చావుకి కారణాల్లాగే మన రోడ్డు ప్రమాదాలకూ లెక్కలేనన్ని కారణాలు. అన్నీ స్వయంకృతాలే, ప్రభుత్వాలూ ప్రజలూ తలచుకుంటే మార్చగలిగేవే.

మనం మారాలి…

Road rage accident on early morning All Spot Dead

Road rage accident on early morning All Spot Dead

అదేమిటో బండి ఎక్కగానే ప్రతివాళ్లూ పరీక్ష రాసే పిల్లల్లాగే ఫీలైపోతారు. ఒక్క క్షణం ఆలస్యంగా వెళ్తే ఎక్కడ లోపలికి రానివ్వరోనన్నట్లు దూసుకుపోతుంటారు. పదినిమిషాలు ఆలస్యంగా వెళ్తే కొంపలేమీ అంటుకోవు. కాకపోతే ఆఫీసుకు రోజూ ఆలస్యంగా వెళ్లకూడదు కాబట్టి ఇంకా కొంచెం ముందు బయల్దేరాలి. అర్ధరాత్రి వరకూ సినిమాకో షికారుకో వెళ్లి, ఉదయం ఆలస్యంగా నిద్రలేచి హడావుడిగా తయారై వాహనాన్ని వేగంగా నడపడం ద్వారా ఆలస్యాన్ని సర్దుబాటు చేసుకోవాలనుకోవడం మనల్ని మనం ప్రమాదంలో పడేసుకోవడమే కాదు, ఎదుటివారినీ ప్రమాదంలోకి నెట్టడమే. రోడ్డు మీద ప్రయాణం టీమ్‌ వర్క్‌ లాంటిది. అందరూ కలిసి సమన్వయంతో సాగితేనే ప్రయాణం సజావుగా ముగుస్తుంది. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు స్పీడు పెంచినా తగ్గించినా, బ్రేకు వేసినా, సిగ్నల్‌ ఇవ్వకుండా సడన్‌గా కుడిపక్కకో ఎడమపక్కకో మలుపు తిరగాలనుకున్నా ప్రమాదం జరుగుతుంది. చుట్టూ ఉన్న వాహనాలను దృష్టిలో పెట్టుకుని మన వాహనాన్ని నడపాల్సి ఉంటుంది. అసహనం అసలు పనికిరాదు. పచ్చలైటు పడేవరకూ ఉండలేక రాంగ్‌రూట్‌లో మరో పక్కకి తిరగడమంటే మనం నియమాలను అతిక్రమించడమే కాక రూల్స్‌ ప్రకారం వెళ్లేవాళ్లకూ చికాకు కలిగించడమే. బండి నడిపేటప్పుడు సెల్‌ఫోన్‌ అర్జెంట్‌గా మాట్లాడాల్సివస్తే ఒక్క క్షణం బండి పక్కన ఆపి మాట్లాడొచ్చు. ఆ తర్వాత ప్రశాంతంగా ప్రయాణం కొనసాగించొచ్చు. ఇక మద్యం తాగి బండి నడపడమూ, మైనర్లు సరైన శిక్షణ లేకుండా నడపడమూ ఎన్ని ప్రమాదాలకు కారణమవుతోందో రహదారుల భద్రత శాఖ వెలువరించే గణాంకాలు చెబుతాయి. బండి మీద డాడ్స్‌ గిఫ్ట్‌, మామ్స్‌ గిఫ్ట్‌ అని గర్వంగా రాసుకుంటే సరిపోదు. వారికీ రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలి కదా! ‘మీ అబ్బాయికి యాక్సిడెంట్‌ అయింది’ అన్న ఫోన్‌ కాల్‌ ఎప్పటికీ వారికి వెళ్లకుండా చూసుకోవడమే వారికిచ్చే సరైన బహుమతి. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని ఎక్కించుకుని మరీ రాంగ్‌రూట్‌లో ప్రయాణిస్తారు. రేపు పిల్లల నుంచి ఎలాంటి వార్తలు తాము వినకూడదనుకుంటారో ఒకసారి ఆలోచిస్తే మళ్లీ ఆ పని చేయరు.

మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి . . . ! (కింద నంబర్స్ పేజెస్ ఉన్నాయా ఐతే ఇంకా చదవండి క్లిక్ చేయండి )
 •  
 • 19
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  19
  Shares